Friday, April 19, 2024

సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం

ఉత్తమ దర్శకత్వానికి ఆస్కార్ అవార్డు పొందిన చైనా మహిళ

సినిమా ప్రపంచంలో శిఖరప్రాయమైన పురస్కారంగా ‘ఆస్కార్’ను భావిస్తారు. 93వ అకాడెమి అవార్డ్స్ ఉత్సవం వైభవంగా జరిగింది. పరిమితమైన సంఖ్యలోనే ప్రేక్షకులు పాల్గొన్నారు. అది కూడా కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే. కోవిడ్ 19 కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న ఈ వేడుకకు ఎట్టకేలకు శుభం కార్డ్ పడింది. అవార్డ్స్ ఎంపిక ప్రక్రియలో భాగంగా కొన్ని నామినేషన్ దాకా వచ్చి ఆగిపోతాయి. కొన్ని మాత్రమే అవార్డును దక్కించుకుంటాయి. కొందరిని మాత్రమే ఆ కీర్తికాంత వరిస్తుంది. ఇది చాలా సహజమైన పరిణామం.

‘నొమాడ్ ల్యాండ్’ కు అవార్డుల పంట

ఈ సంవత్సరం “నొమాడ్ ల్యాండ్” సినిమాకు అవార్డుల పంట పండింది. ఆసియన్ మహిళకు తొలిసారిగా, దర్శకత్వ విభాగంలో అవార్డు రావడమే ఈ సంవత్సరం విశిష్టత. ఈ సినిమాకు సంబంధించి ఆరు విభాగాలు నామినేషన్ దాకా వెళ్లాయి. ముచ్చటగా మూడు విభాగాలు  అవార్డులను గెలుచుకున్నాయి. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటనకుగాను ఈ కీర్తి దక్కింది. అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు జెప్సికా బ్రూడర్ రాసిన ‘ నొమాడ్ ల్యాండ్ : సర్వైవింగ్ అమెరికా ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ‘ పుస్తకం ఈ సినిమాకు మూలం. 2017లో ఈ పుస్తకం వెలువడింది. దీన్ని ఆధారంగా చేసుకొని క్లోవీ చావ్ ఈ సినిమాను మలచారు. ఉత్తమ దర్శకురాలుగా అవార్డును గెలుచుకున్నారు. సంచార జీవితం గడిపేవారి జీవన చిత్రమే ఈ కథలోని ముఖ్యమైన అంశం. అమెరికాలో వచ్చిన ఆర్ధిక మాంద్యం వల్ల కొందరు ఉద్యోగాలు, ఉపాధి, సన్నిహితులను కోల్పోయారు.

ఉపాధికోసం వేట

ఉపాధి వేటలో భాగంగా, వివిధ ప్రాంతాలకు సంచరిస్తూ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. భిన్నమైన జీవనశైలితో ముందుకు సాగుతూ వుంటారు. వారిలో, ఫెర్న్ అనే 61ఏళ్ళ మహిళ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆర్ధిక మాంద్యంలో ఉద్యోగాన్ని కోల్పోయింది.  భర్తను కోల్పోయింది. సంతానం కూడా లేదు. చెప్పలేని శూన్యత జీవితాన్ని చుట్టుకుంటుంది. తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి ఒక వ్యాన్ కొనుక్కొని, దాన్నే ఇల్లుగా మార్చుకుంటుంది. ఊర్లు తిరుగుతూ, డబ్బులు సంపాయిస్తూ, ఆ వ్యాన్ లోనే జీవిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో సంచార జీవితం గడిపే వాళ్ళు ఎందరో తారసపడుతుంటారు.

స్నేహాలూ, బంధాలూ

వారితో స్నేహాలు, బంధాలు పెంచుకుంటూ, వీడ్కోలు పలుకుతూ మరో ప్రాంతానికి వెళ్తూ వుంటుంది. కలిసిన వారందరితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతూ, మధ్య మధ్యలో కొందరికి సాయం కూడా అందిస్తూ ఆనందంగా తన సంచార జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. పరిచయమైన వారిలో కొందరు శాశ్వతంగా మా ఇంట్లో ఉండిపొమ్మని చెప్పినా సున్నితంగా తిరస్కరిస్తుంది. ప్రకృతిని, ప్రాంతాలను, వివిధ రుచులను, అనుభూతులను అనుభవించడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. పైకి ఆహ్లాదంగా, వినోదంగా కనిపించినా ఈ జీవనం అంత ఆషామాషీ కాదు. ఉపాధి వెతుక్కోవడం, దారి మధ్య వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడం, ఒంటరిగా బతకడం, ఏకాంతాన్ని జయించడం సామాన్యమైన విషయం కానే కాదు.

గుండెని పిండీ పాత్రలు

ఈ ఒంటరి సంచార జీవనంలోని విభిన్నమైన అనుభూతుల సమాహారమే “నొమాడ్ ల్యాండ్ “. పైకి నవ్వులు కనిపిస్తున్నా, లోపల ఆవరించుకున్న శూన్యత ఆమె కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది. దేన్నైతే గుర్తుపెట్టుకుంటామో, అదే జీవితాన్ని గుర్తుచేస్తూ ఉంటుందనే భావనలో ఆమె ఉంటుంది.  జ్ఞాపకాల పొదరిల్లుతోనే గుండెను కప్పేసుకుంటోంది. ఈ సంచార జీవనంలో శాశ్వతమైన బంధాలు లేవు, వీడ్కోళ్ళు లేవు. మళ్ళీ తిరిగి కలుస్తామనే ఆశతోనే ఈ సంచార జీవితాలు సాగుతూ ఉంటాయి. సున్నితమైన అంశాన్ని, ప్రత్యేకమైన జీవనశైలిని కలగలిపి నడిపిన కథాకథనమే పురస్కార పరంపరకు సోపానమై నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు హృదయాన్ని పిండేస్తాయి.ఏకైక కుమారుడిని కోల్పోయిన పాత్ర ఒకటి, క్యాన్సర్ తో బాధపడే మరో పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఆర్ద్రతను నింపి, కళ్ళల్లో కన్నీటి సుడిగుండాలను సృష్టిస్తాయి. 

చైనా మహిళకు ఉత్తమ దర్శకత్వం అవార్డు

డేవిడ్ ఫించర్, థామస్ వింట్ బెర్గ్, లీ ఇసాక్ చంగ్ వంటి దర్శకులను దాటి క్లోవీ చావ్ అవార్డును గెలుచుకున్నారు. ఇందులో ఎన్నో విశేషాలు దాగివున్నాయి. ఈమె చైనా మహిళ. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి ఆసియన్ మహిళా దర్శకురాలుగా నేడు కీర్తి శిఖరాన్ని అధిరోహించారు. ఈమె గతంలో దర్శకత్వం వహించిన “సాంగ్ మై బ్రదర్స్ టాట్ మి ” అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలను పొందింది. ‘నొమాడ్ ల్యాండ్ ” లో ప్రథానమైన భూమిక పోషించిన ఫ్రాన్సెస్ మెక్ డోర్మెండ్ ‘ఉత్తమనటిగా’ ఆస్కార్ ను దక్కించుకున్నారు. ఇప్పటికే, రెండు సార్లు ఆస్కార్ పురస్కారాన్ని పొందిన ఈ నటికి ఈ సినిమాతో మూడోసారి కూడా రావడం గొప్ప గెలుపు. డోర్మెండ్ నలభైఏళ్ళుగా చిత్రసీమలో దిగ్విజయ పరంపరలో సాగుతున్నారని చెప్పడానికి ఈ పురస్కారాలే ఆస్కారాలు.

భూమార్గం పట్టిన ఆస్కార్

“ఈసారి ఆస్కార్ భూమార్గం పట్టింది,”  అని ప్రఖ్యాత విశ్లేషకుడు స్టీఫెన్ “టైమ్” మ్యాగజైన్ లో అద్భుతమైన వ్యాసం రాశారు. అందులో బోలెడు ప్రశ్నలు సంధించారు. మరికొన్ని బాణాలు గాల్లోకి కొట్టారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇళ్లకు, గదులకే పరిమితం చేసింది. ప్రతిభా పాటవాలు అట్లుంచగా, జాతి, వర్గ,వర్ణ వ్యవస్థల మధ్య అంతరాలు, పీడిత,తాడిత అనుభూతులను సమన్వయం చేయాల్సిన అవసరం, సమన్యాయం చూపాల్సిన బాధ్యత కూడా భుజాలపైన ఉంది. ‘నొమాడ్ ల్యాండ్ ‘ కథ అమెరికన్ ది, కథనంకూడా అక్కడదే. దర్శకత్వం చేసింది ఆసియన్, చైనా మహిళ. ఈసారి అవార్డుల ఎంపికలో కొన్ని కొత్త ఆలోచనా ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రతి సంవత్సరం ప్రకటించే వ్యవహారంలో, ఏదో పెద్ద ప్రత్యేకత చూపించి, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా గుర్తుండేట్లు చేయాలని నిర్వాహకులు తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉంటారు. ఆర్ధిక,రాజకీయ,జాత్యంశాల ప్రాతిపదికలను కొట్టిపారెయ్యలేం.

సత్యజిత్ రే ఒక్కరే

ఆస్కార్ లో మనం కూడా కొంత సందడి చేశాం. అనేక విభాగాల్లో నామినేషన్ దాకా అనేకసార్లు వెళ్ళాం, కొన్ని అవార్డులను కూడా గెలుచుకున్నాం. 1958లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో “మదర్ ఇండియా” ఉత్తమ చిత్రం అవార్డును కోల్పోయింది. 1983లో “గాంధీ” సినిమాకు కాస్ట్యూమ్ విభాగంలో, భానూ అథైయా గోల్డెన్ ట్రోఫీ అందుకున్నారు. 1992లో సత్యజిత్ రే “అకాడమీ గౌరవ పురస్కారం” సాధించారు. ఇప్పటి వరకూ ఈ ఘనతను పొందిన భారతీయుడు సత్యజిత్ రే మాత్రమే. 2008లో భారతీయ కథతో రూపొందుకున్న ” స్లమ్ డాగ్ మిలియనర్ ” చిత్రంలో ఒరిజినల్ సాంగ్, స్కోర్ పేరుతో ఏ ఆర్ రెహమాన్ రెండు అవార్డులు దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం మన ” వైట్ టైగర్” సినిమా నామినేషన్ దాకా వెళ్ళింది. ఫలితం తెలియాల్సి వుంది. ఈ సారి సంచార జీవనం కథ బోలెడు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం అభినందనీయం. ఆస్కార్ పురస్కార ఎంపికా ప్రక్రియా హృదయాలకి దగ్గరగా ఉండేట్లుగా వంట వండడం కొందరికి బాగా తెలుసు. వారు కొన్ని నెలల ముందే ఆ వంట ప్రారంభిస్తారు. అవార్డుల పంటను అందుకుంటారు. మన దగ్గరా ప్రతిభకు కొదువ లేదు. ఏదో ఒక రోజు భారతీయులు ఆస్కార్ అవార్డుల పంటను అందుకుంటారని ఆకాంక్షిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles