Wednesday, May 12, 2021

భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

మెక్సికోలో ఒక పార్లమెంటు సభ్యుడు సమావేశాలు జరుగుతూ ఉండగా బట్టలిప్పి కట్ డ్రాయర్ తో  నిలబడి, వాళ్ళ ప్రధాని పరువు తీశాడు. ‘‘నన్ను నగ్నంగా చూడటానికి నువ్వు సిగ్గుపడొచ్చు. కానీ, ప్రైవేటు కంపెనీల వల్ల దేశం మొత్తం నగ్నంగా తయారై, ఉద్యోగాలు లేక, ఆకలితో ప్రజలు అలమటిస్తున్నా, ప్రజాసంపదను దోచుకుంటున్నా- నీకు మాత్రం సిగ్గూ, శరమూ లేవు,’’ అని ప్రధానిని కడిగిపారేశాడు. కమిట్ మెంట్ అంటే అది. తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రధాన సమస్యను మొత్తం దేశం దృష్టికి తెచ్చేందుకు తన వ్యక్తిగత మానాభిమానాలను కూడా త్యాగం చేశాడు ఆ మెక్సికన్ యం.పి! నిబద్ధత, కట్టుబాటు అంటే అలా ఉండాలి! మన భారతదేశంలో మన పార్లమెంటు మెంబర్లు అంత నిబద్దతతో పని చేస్తున్నారా? పైన ఉదహరించిన మెక్సికన్  యం.పి. లాగా వీళ్ళెందుకు పని చేయడం లేదూ? అని నేనడగడం లేదు. అన్ని విషయాల్లో  ప్రత్యేకతల్ని నిలుపుకుంటూ కనీసం మన కామ్రేడ్లయినా నిజాయితీగా ప్రవర్తిస్తున్నారా? లేక, ఇతర బూర్జువా పార్టీ నాయకులను అనుసరిస్తున్నారా? పరిశీలించుకోవాలి! అర్ధ దశాబ్దికి ముందు దేశంలో ఎలక్షన్లు వస్తే రెండే రెండు గుర్తులు ప్రధానంగా కనిపించేవి – కాడెద్దుల గుర్తు (కాంగ్రెస్), కంకి కొడవలి గుర్తు (కమ్యూనిస్ట్). ఉన్న రెండు పార్టీలలో ఒకటిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు ఎక్కడుంది? దాని స్థాయీ, స్థానం ఏమయ్యాయి? మానవీయ విలువలకు కట్టుబడి పనిచేసేవారే తమ తప్పులు తాము సరిచేసుకోలేకపోతే, ఇక సమాజంలో జరుగుతున్న తప్పుల గురించి వారేం ప్రశ్నించగలుగుతారూ? ఏం చేయగలుగుతారూ?

ఒక కమ్యూనిస్టు నాస్తికుడు కాకపోవడం నిబద్ధహీనత! అది వ్యక్తిగతం – కాబట్టి దాన్ని పక్కన పెట్టేయొచ్చు. ప్రజల క్షమిస్తే క్షమిస్తారేమో కూడా! కానీ ‘ఒక కమ్యూనిస్టు నాస్తికుడు కానక్కరలేదని’ బహిరంగంగా ప్రకటించడం మాత్రం బుద్ధిహీనత!! అంతే కాదు. అది సమాజద్రోహం. దాన్ని ప్రజలు క్షమించరు.  మరో రకంగా చెప్పుకోవాలంటే నాస్తికుడు కాని వాడు కమ్యూనిస్టు అయి మాత్రం ఏం చేయగలడనీ? కమ్యూనిటీ గురించి ఆలోచించని వాడు కమ్యూనిస్టునని చెప్పుకోవడమే సిగ్గు చేటు. అంటే ఈ సమాజం ఇలా రోగ గ్రస్తమై దేవుడు, దయ్యం, మహిమల్లాంటి మూఢనమ్మకాలతో  ముక్కుతూ, మూల్గుతూ ఉండడం కోరుకుంటున్నారా? ఇలాంటివారికి ఇక వైజ్ఞానిక స్పృహ ఉంటుందని ఎలా అనుకుంటాం? కమ్యూనిజం మూల సూత్రాల గురించి ఎవరైనా తెలుసుకోవచ్చు. ఎవరైనా అధ్యయనం చేయొచ్చు. కానీ ఆ మూల సూత్రాలను జీవితానికి అన్వయించుకొని జీవించడమే నిబద్ధత. అదే ప్రజ్ఞ, అదే ఉన్నతమైన వ్యక్తిత్వం!

అభ్యదయ రచయిత తిరోగమనం!

నేను చదువుకునే రోజుల్లో, అంటే డెబ్బయ్ దశకంలో, హైదరాబాద్ లో ఒక గొప్ప తెలుగు నవలారచయిత ఉండేవారు. తెలంగాణ జీవితంమీద అత్యద్భుతమైన పీరియాడిక్ నవలలు రాశారు. అందులోనుంచి ఒకటి, రెండు సినిమాలు కూడా వచ్చాయి. తెలుగు సాహిత్యానికి గోర్కీ లాంటివాడని కుర్రవాళ్ళం ఆయనను తెగ అభిమానించేవాళ్ళం. కమ్యూనిస్టు ఆలోచనా ధోరణితో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షులయ్యారు. కొంత కాలం గడిచింది. ఆయన తనను, తన స్థాయినీ, తన ఆలోచనా ధోరణినీ తీసి పక్కన పడేశారు. వేదాల ఆంధ్రీకరణకు పూనుకున్నారు. అంతవరకూ ఉండిపోయినా బాగుండేదేమో. చొక్కా వేసుకోవడం మానేసి, నుదుటికే కాదు ఒంటి నిండా నిలువు బొట్టు పెట్టుకోవడం ప్రారంభించారు. శ్రీవైష్ణవ సంప్రదాయ ఉద్ధారకుడిగా మారిపోయారు. ఎంతో సన్నిహితంగా, చనువుగా మెలిగే నేను, దూరంగా ఉంటడం మొదలుపెట్టాను. కారణం ఆయనలోని మార్పు నాకు నచ్చలేదు. కమ్యూనిస్టులు సంప్రదాయవాదులుగా అవతరించొచ్చా? ఏమో. అప్పటికి నాకింకా స్పష్టమైన అవగాహన లేకపోయినా ఆయనలోని మార్పు అభ్యుదయం కాదనిపించింది. ఆయనలోని తిరోగమనాన్ని భరించలేనని అనిపించింది.

ఆ రోజుల్లోనే కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు కథానిక మీద ఒక సెమినార్ నిర్వహించింది. అందులో ఆయనా, నేనూ వేరువేరు సెషన్స్ లో వక్తలుగా ఉన్నాం. ఇక్కడైనా ఆయన చాదస్తాలు మానేసి, తనలోని తెలుగు గోర్కీని నిద్రలేపి మాట్లాడుతారు – అని అనుకున్నాను. నేనే కాదు, సభ మొత్తం నిరాశలో మునిగిపోయింది. వేదాలను అనువదించిన తన అనుభవాన్నంతా రంగరించి, ఆయన సభికులకు వేదసారాన్ని బోధించి వెళ్ళారు – అది తెలుగు కథానిక పైన సదస్సు అనే విషయం కూడా మరచిపోయినట్టున్నారు. ఏ రంగంలోనైనా పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, దాన్ని నిలుపుకోవడం మరో ఎత్తు. అది అందరికీ చేత కాదు. ఇలాంటిదే నేను నిరాశానిస్పృహలలోకి జారిపోయిన సన్నివేశం మరొకటి జరిగింది.  తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్ సాధించిన ఉద్దండుడైన ఒక కవి చెప్పుల షాపు ప్రారంభించడం చూసి కళ్ళు తిరిగి ముర్ఛిల్లి పోలేదు కానీ, అవాక్కయి పోవడం అంటే ఏమిటో అప్పుడే తెలుసుకున్నాను.

జ్ఞానం సంపాదించివారందరూ ప్రజ్ఞావంతులు కారు

జ్ఞానం సామూహికం. ప్రజ్ఞ వ్యక్తిగతం. జ్ఞానం సంపాదించుకున్నవారందరికీ ఒకే రకమైన ప్రజ్ఞ ఉండాల్సిన పని లేదు. అందుకే సమాజంలో మనం చూస్తున్నాం. సైన్స్ చదివిన కొందరిలో సైంటిఫిక్ టెంపర్ ఉండటం లేదు. కమ్యూనిస్టులలోనే కొందరు సంప్రదాయ మనువాదులు ఉంటున్నారు. మనుషుల ఆలోచనలు కలగాపులగంగా ఉంటడం వల్ల, సంప్రదాయ కుటుంబాల నుంచి నాస్తికులు పట్టుకొచ్చారు. నాస్తిక కుటుంబాలలో పుట్టి పెరిగినా కొందరు ఎందుకో నాస్తికులుగా నిలబడ లేకపోతున్నారు. ఏవేవో ఒత్తిళ్ళకు లోనై జీవితంలో రాజీపడి, విలువలు పోగొట్టుకుంటున్నారు. ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా, ఎవరి ఆలోచనలు ఎలాగున్నా మనం కోరుకునేది రెండే విషయాలు.

  1. మనుషులంతా ఒక్కటే- అని గ్రహించాలి! మనుషులు మనుషుల్లా ప్రవర్తించాలి!!
  2. మనిషన్నవాడు సత్యాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించాలి.

ఈ రెండు పనులూ చేయలేనివారు, తమను తామ ఎలా ప్రకటించుకున్నా, ఏమని ప్రకటించుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా- వృధాయే. వారు సమాజానికి ఉపయోగపడరు. దిగజారినవారిగా వారిపై భవిష్యత్తు ముద్రవేస్తుంది.

‘‘ఇంట్లో న్యాయం, సమానత్వం పాటించకుండా, అవి ప్రజాజీవితంలో మాత్రం ఉండాలని ఆశించలేం! ఇంట్లో అణచివేతకు పాల్పడే పురుషుడు, వీధిలోకో, న్యాయంస్థానంలోకో, చట్టసభలలోకో వచ్చే సరికి హఠాత్తుగా మారిపోయి ‘సాధువు’ కాలేడు,’’ అని అన్నారు – తమిళ జాతీయ కవి, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్యభారతి.

అగ్నికణమే నిజం-

నిజం కంటే గొప్పది కమ్యూనిజం!- అని అన్నారు ఒకాయన. నిజంకాన్నా గొప్పదేదో ఉందన్నవారు తప్పకుండా అవివేకే అవుతారు.

‘‘మేం నాస్తికులం కాదు. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదు’’- అని ఒక కమ్యూనిస్టు జాతీయ నేత ప్రకటించారు. అది ఆయన వ్యక్తిగత ప్రకటనా? లేక భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకటనా? స్పష్టం చేయలేదు. ప్రతిభావంతుడైన యువనేత కన్హయ్య కుమార్ ను దగ్గరుండి ఓడిపోయేట్టు చేయగలిగిన ప్రతిభావంతుడాయన. ‘‘దారి తప్పిన కమ్యూనిస్టు నాయకులు మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే మంచిది,’’ అని జనం బహిరంగంగానే అనుకుంటున్నారు. విశాఖలో ఓ స్వామిని యాదృచ్ఛికంగా  కలిశానని ఆ నేత చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఆయనేమైనా మీకు బజారులో అనుకోకుండా తారసపడ్డారా? లేదే? మీరు ఆయన ఆశ్రమంలోకి వెళితేనే ఆయన కలిశారు కదా? ఏమైనా కమ్యూనిస్టు పార్టీలకు, నాయకులకు సైద్ధాంతిక పునాదే బలం. దానికి విఘాతం కలిగించే ఏ ప్రకటన చేసినా – జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి కదా? దేవుడు వరాలు ఇవ్వడం వల్ల మనిషి బతుకుతున్నాడనేది భ్రమ – మనిషి కానుకలు సమర్పించడం వల్లనే దేవుడు బతుకుతున్నాడనేది నిజం – అయినప్పుడు ఒక కమ్యూనిస్టు జాతీయ నేత ‘‘దేవుడికి వ్యతిరేకం కాదు,’’ అని బహిరంగంగా ప్రకటించడం సబబేనా? ‘‘తన అజ్ఞానపు అవధుల్ని తెలుసుకోవడమే సరైన జ్ఞానం, సరైన విద్య అవుతుంది,’’ అని అన్నారు చైనా తత్త్వవేత్త కన్ ఫ్యూజియస్. ప్రతి కమ్యూనిస్టూ హేతువాది కాకపోవడమే ఈ దేశంలో వైజ్ఞానిక స్పృహ పెరగక పోవడానికి కారణం. ప్రతి సైన్స్ విద్యార్థీ హేతువాది కాకపోవడం, ప్రతి హేతువాదీ  సైన్స్ తెలుసుకోకపోవడం, ప్రతి నిరీశ్వరవాదీ ప్రకృతిని అర్థం చేసుకోకపోవడం… వగైరా దేశంలో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ‘‘లోక రక్షకుడు ఎవ్వరూ లేరు.మీకు మీరే రక్షకులు కావాలి,’’ అని అన్నాడు కదా బుద్ధుడు.

తప్పులు దిద్దుకోవడమే మానవ లక్షణం

తప్పు చేయనివారు మనుషుల్లో ఉండరు. తప్పులు జరగని ఉద్యమాలూ బహుశా ఉండవు. జరిగిన తప్పుల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడమే మానవ లక్షణం. వైజ్ఞానిక స్పృహ లేని వైజ్ఞానికులూ, శాస్త్రీయ అవగాహన లేని ఉపాధ్యాయులూ, అధ్యాపకులూ, పరిపాలనా రంగంలోని ఉన్నతోద్యోగులూ, దేశ, రాష్ట్ర పరిపాలకులూ దేశానికీ, దేశ ప్రజలకూ చేసే కీడు బేరీజు వేయడం కష్టం! దేశం ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి వేస్తున్నది – ఇదిగో ఇలాంటివారి వల్లనేనని తేలిపోయింది. కమ్యూనిస్టులతో సహా పైన చెప్పుకున్న వీళ్ళంతా మనువాదుల ప్రభావంలోంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. లేకపోతే, దేశం ముందుకు పోవడం  చాలా కష్టం! నేను ఎత్తి చూపిన విషయాల గూర్చి అహంకారంతో, అసహనంతో ఆలోచించనివారు కొందరుంటారని తెలుసు. కానీ, కొదరైనా సహృదయంతో వాస్తవాల్ని అర్థం చేసుకుంటారనీ, తమని తాము సరిదిద్దుకుంటారనీ – చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణానికి కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం సమకూర్చుకొని సంసిద్ధులవుతారనీ ఆశిస్తున్నాను. భ్రమల్ని వదిలేస్తూ, మానవీయ విలువలకు, విజయాలకు జేజేలు పలికే వారంతా మనకు ఎప్పుడూ గౌరవనీయులే! ఎప్పుడూ ఆదర్శప్రాయులే!!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles