Sunday, November 10, 2024

ఆంగ్లంలో ప్రవహించిన అన్నమయ్య భక్తి రసం

ఎ కృష్ణారావ్

‘భక్తి రసం హిందీ సాహిత్యంలో పరాకాష్టనందుకుని అనన్య సామాన్య సౌందర్యాన్ని సంతరించుకుంది.’ అని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఒక సందర్భంలో రాశారు. హిందీ మహాకవులు సూరదాస్, నందదాస్ ఉద్దవ గోపికా సంవాదం ద్వారా సగుణ, నిర్గుణ వాదాన్ని అత్యంత మనోహరంగా, రసభరితంగా రచించారని ఆయన వివరించారు. ‘ఎవరి గుణాలను చూసి రాత్రింబగళ్లు మేమందరం స్మరించుకుంటున్నామో ఆయనను నిర్గుణుడంటున్నావేమి?’ అని గోపికలు ప్రశ్నించేసరికి ఉద్దవుడు సిగ్గుపడి ‘వారి పాదధూళిని తలధరించి నేను కృతకృత్యుడయ్యాను’ అని ఒప్పుకోక తప్పలేదు. ఆంధ్ర మహాభాగవతంలో పోతన కావ్యప్రతిభ అడుగడుగునా కానవచ్చినప్పటికీ భక్తికి సంబంధించిన ఉదంతాల్లో మూల భాగవతాన్ని అనుసరించారని, హిందీ మహాకవులు కొత్త ఒరవడిని సృష్టించారని పీవీ విశ్లేషించారు.

ప్రొఫెసర్ ఎం రాజగోపాలచారి గారు మరియు ఎ కృష్ణారావ్ గారు

పదకవితకు ఆద్యుడు అన్నమయ్య

16వ శతాబ్దానికి చెందిన సూరదాస్, నందదాస్ లకు శతాబ్దానికి ముందే తెలుగులో భక్తి సాహిత్యంలో కొత్త పరవళ్లు సృష్టించిన మహా కవి ఉన్నారు. ఆయనే అన్నమయ్య అని చెప్పక తప్పదు. తెలుగులో అంతకుముందు ఎవరూ రాయని విధంగా పదకవితలతో భక్తిలో తాదాత్మ్యం పండించిన కవి అన్నమయ్య. అన్నమయ్య వాజ్ఞ్మయంపై అనితరసాధ్య కృషి చేసినరాళ్లపల్లి అనంతకృష్ణ శర్మమాటల్లో చెప్పాలంటే, ‘వేంకటేశ్వరునే ఆధిభౌతికమైన, ఆధ్యాత్మికమైన సర్వప్రపంచంలోనూ అంతర్యామిగా, బహిర్యామిగా పూజించి, ప్రేమించి, కలహించి జీవితంలోని అంతరంగ బహిరంగ పరమాణువులన్నిటా అతని బతుకే బతికినాడు. ఆ అనుభవాన్ని మానసికంగా, కాయికంగా మాత్రమే కాదు, వాచికంగా కూడా అనుభవించినవాడు. ఆ వాచికానుభవాలే ఆయన పదకవితలు’. ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు?

అహోబల నృసింహుడి భక్తుడైన ఆది శఠగోప యతీంద్రుడి మూలంగా రామానుజుడి విశిష్టాద్వైత సంప్రదాయాన్ని సంతరించుకున్న అన్నమయ్య సాహిత్యంలో ఎల్లెడలా వైష్ణవ సిద్దాంతం ప్రతిఫలిస్తుంది. ఆయన పై కర్ణాటకకు చెందిన శ్రీపాదరాయస్వామి పాటలతో చేసిన భక్తి,తత్వ,నీతి, ధర్మ ప్రచారం ప్రభావం ఉన్నదనికూడా రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ 1952లో రచించిన ఒక వ్యాసంలో రాశారు. కన్నడ భక్తిసాహిత్యం ది మరో చరిత్ర అయినప్పటికీ అన్నమయ్య తన సంకీర్తనలతో పురంధర దాసు, త్యాగరాజు, రామదాసులను కూడా ప్రభావితం చేశారనడంలో సందేహం లేదు.

భగవంతునితో భక్తికి గల సంబంధం విచిత్రమైనది. భక్తుడు దాసుడే కాదు సఖుడు, సఖికూడా. తల్లే కాదు, పత్ని కూడా. దీనివల్లభక్తునకు, భగవంతునికి సామీప్యం, సాహచర్యం రెండూ లభిస్తాయి. గోపికలు, నమ్మాళ్వారులు, రాధ, గోదాదేవి ఈ మధుర భక్తిని అనుసరించే తరించారు, అన్నమయ్య ఈ మహాభక్తుల మార్గంలోనే శ్రీనివాసుని ఆరాధించారని రాళ్లపల్లి రాశారు.వేటూరి ప్రభాకర శాస్త్రితిరుమలలో అన్నమయ్య సంకీర్తనా భాండాగారాన్ని త్రవ్వి తీయకపోతే భక్తిసాహిత్యంలో ఒక తెలుగు వాడు సృష్టించిన భావ విప్లవం తెరమరుగై పోయి ఉండేదేమో.

అన్నమయ్యను ఆంగ్లంలోకి అనువదించడమా?

అచ్చమైన, సహజమైన ప్రజలు మాట్లాడే ప్రాంతీయ భాషలో వేల పాటలు రచించిన అన్నమయ్యను ఆంగ్లంలో అనువదించడం అంత సులభమైన పని కాదు. ఆ రచనల్లో ఉన్న నిగూఢమైన భక్తి భావాన్ని, వేదాంతాన్నిఆంగ్లంలో అంతే లోతుగా చెప్పడం క్లిష్టమైన పని. విలియం జాక్సన్, ఎకె రామానుజన్, వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ కొంత కృషి చేశారు.

ఈ నేపథ్యంలో High in the Sky at Vishnupada’ అన్న పేరుతో ప్రొ. మాడభూషి రాజగోపాలాచారి గారు అన్నమయ్య సంకీర్తనలను చేసిన అనువాదం చూస్తుంటే అబ్బురం కలుగుతుంది. కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేసిన రాజగోపాలచారి గారు ఇటీవలే ఈ పుస్తకం రాశారు.

రాజగోపాలచారి గారు నాకు వరంగల్ లో కాలేజీలో ఇంగ్లీషు బోధించేవారు. మధ్యాహ్న భోజనానంతరం ఆయన క్లాసుకు హాజరయ్యేవారం. అయినప్పటికీ మధ్యాహ్నం పూట కనురెప్పలపై వాలిన పక్షులు ఎగిరిపోయి తనువూ, మనసూ ఆయన వాక్ప్రవాహంలో కొట్టుకుపోయేవి. తెలుగు కవులతో సమానంగా ఆంగ్ల కవులపై ప్రేమ కలిగేందుకు ఆయన పాఠం చెప్పే తీరే కారణమైంది. అప్పటికే ఆయన ప్రముఖ ఆంగ్ల రచయిత మనోహర్ మల్గోంకర్ పై పరిశోధనపూర్తి చేశారు. ఇండియన్ లిటరేచర్ లో ఆయన వ్యాసాలు ప్రచురించేవారు. ఆయన దాదాపు 13 పుస్తకాలు రచించారు.

మాడభూషి ది పండిత వంశం అని వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తండ్రి ప్రముఖ జర్నలిస్టు మాడభూషి శ్రీనివాసాచార్య ఆ రోజుల్లో జనధర్మ పత్రికను ప్రచురిస్తూఉండేవారు. నేను భయంభయంగా వరంగల్ చౌరస్తా సమీపంలో ఉన్నఆ పత్రిక కార్యాలయానికి వెళ్లి నా కవితల్ని ఇచ్చి ఆయన ఏమంటారో అన్న భయంతో వెనక్కిచూడకుండా తిరిగి వచ్చేవాడిని. రాజగోపాలాచారి గారిసోదరుడు మాడభూషి శ్రీధరాచార్యులు నాకు జర్నలిజంలో సీనియర్ మాత్రమే కాక న్యాయకోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఢిల్లీలో సమాచార కమిషనర్ గా పనిచేయడం ఆయన కొక చిన్న అలంకారం మాత్రమే.

రాజగోపాలాచారి గారు అన్నమయ్యపై ప్రచురించిన పుస్తకం ఒక్క మాటలో చెప్పాలంటే అన్నమయ్య విశ్వరూపాన్ని పూర్తిగా ప్రపంచానికి పరిచయం చేసిన తొలి అద్భుత పుస్తకం. స్వయంగా వైష్ణవుడైన రాజగోపాలాచారి అన్నమయ్య లో పూర్తిగా లీనమై ఆయన భక్తి పారవశ్యంలో సంలీనమై ఆయన పదకవితలను అనువదించారా అన్న అభిప్రాయం కలుగక మానదు.

అన్నమయ్య సంకీర్తనలను ఆయన అయిదు భాగాలుగా విభజించారు. ఒకటి- వేంకటేశ్వరుడి వైభవాన్ని కీర్తించడం, రెండు- అలమేలు మంగ కృపాకటాక్షాలను, ప్రాభవాన్ని వర్ణించడం, మూడు- భగవంతుడి ఇతర రూపాలను ధ్యానించడం, నాలుగు- విశిష్టాద్వైతం, అయిదు- జీవిత అస్తిత్వం, ఆధ్యాత్మిక అన్వేషణ. నేను మొదటి నాలుగు అంశాల లోతుల్లోకి పోదలుచుకోలేదు. భక్తి పారవశ్యపు అనుభవం లేకపోవడమే ఇందుకు కారణం. కాని సామాజిక శాస్త్ర విద్యార్థిగా చివరి విభాగంలో ఆయన ప్రస్తావించిన సంకీర్తనలు జీవితాన్వేషణ చేసే ప్రతి జిజ్ఞాసువు మనసులో తలెత్తే ప్రశ్నల ప్రతిరూపాలే.

కాని వేంకటేశ్వరుడి వైభవాన్నికీర్తించే విభాగంలో కనపడ్డ తొలి పద కవిత-

Behold, there the abode of Lord Srihari,

Begirt with ten thousand hoods of Adi Sesa!

అని చదివినప్పుడు నాకు వెంటనే దాని మూలం హృదయంలో ధ్వనించింది. అది ‘అదిగో అల్లదివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము..’ అని నేనే కాదు, ఆ పాట విన్న ఎవరైనా చెప్పగలరు.. అనిపించింది.

సముద్రం వద్దకు వెళ్లి అలలు ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దామంటే అలలు ఏ నాటికీ ఆగవు కదా.. మన జీవితంలో అన్ని కోరికలు నశించిన తర్వాత తత్వం తెలుసుకోవాలనుకోవడం కూడా అదే అన్నాడు అన్నమయ్య.

కడలుడిపి నీరాడగా తలచువారలకు

కడలేని మనసునకు కడమ యెక్కడిది?

అనిఆయన ప్రశ్నించాడు

Is there a way out for those

Who want to bathe after the waves subside in the sea?

And, for the endless mind fraught with limitless desires?

అన్నారు మన మాడభూషి వారు.

తత్వం బోధపడినవాడు అన్నమయ్య

మార్కెట్ అనే జైలులో ఇవాళ ప్రతి మనిషీ ఒక నంబరు కేటాయించిన వినియోగదారుడు. అన్నమయ్య కాలంలో కూడా రూకలకున్న విలువ రూకలదే. తత్వం బోధపడిన వాడు నాడైనా నేడైనా అన్నమయ్యే.

‘ప్రకటించి కనకమే భ్రమయించీ జగము’ అని అన్నమయ్య ఆలపించారు ‘రూకలై మాడలై రువ్వలై తిరిగీని

దాకొని ఉన్నచోట తానుండ దదివో..’ అన్న సంకీర్తనలో.

It doesn’t lie concealed at a place,

It moves as currency of different denominations.

It is obviously gold that lures world into illusion..

అని సరళంగా రాశారు మా ఇంగ్లీషుమాస్టారు.

అన్నిటికి నొడయడ వైన శ్రీపతివి నీవు

యెన్నరాదు మాబలగమెంచుకో మాఫౌజుఅన్న కీర్తనను విశ్లేషిస్తూ రాజగోపాలాచారి గారు ఇలా రాశారు.

In this song, Annamayya condenses the entire philosophy pertaining to the personality of man. God is like a great commander of the universe. But man is no less a power to reckon with.

‘నువ్వేమో అన్నిటికీ ఏలికవు. ఐనా మా బలం ఏమంత తక్కువేం కాదయ్యా, కావలిస్తే వివరిస్తాను. నువ్వే లెక్కించుకో’ అని ఈ పల్లవి భావం.

మనిషికి రెండు మార్గాలు. ఒకటి అజ్ఞానమనే గాడాంధకారం. జీవితాంతంఈ మార్గంలోనే పయనించేవారు అనేకమంది. రెండవది, జ్ఞానాన్వేషణ. దాన్ని ముక్తి మార్గంగా అన్నమయ్యలాంటి వారు భావిస్తారు.

‘ఏమి సేయువాడ నివి విరసమొకటొకటి

తామసంబొకవంక తత్వమొకవంక..’ అని ఆయన అందుకే అన్నారు.

What can I do? They contradict each other!

Ignorance on one side, and knowledge on the other! అని అనువదించారు మాడభూషి వారు.

ఈ సంకీర్తన చివరిలో అన్నమయ్య పరమానందసంపన్నుండు గాడేని

చరమవిజ్ఞాననిశ్చలుడు గాడు అని రాశారు.

Unless one is enriched by the eternal beautitude, One can’t focus on the final wisdom of surrender! అన్నారు మాస్టారు. Eternal beautitude ఎంత గొప్ప పదం!

‘ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు..’అని అన్నమయ్య అంటే, How many did the soul belong to?అని ప్రశ్నించారు గురువుగారు.

మనం మనుషులమై పుట్టి మనుషులనే సేవిస్తూ నిత్యం దుఃఖిస్తుంటాం..దీన్నే అన్నమయ్య

‘మనుజుడై బుట్టి మనుజుని సేవించి

అనుదినమును దుఃఖమందనేలా..

పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి

వట్టిలంపటము వదలనేరడు గాన.. అన్నారు.

Born a man and serving other men,

Why should you grieve day in and day out?

Why do you like to be chained in the vicious circle of earthly ties? అన్నారు మాడభూషి.

జీవితంలో ఎండమావులు, భ్రమల వెంట పరుగెత్తుతూ కాలాన్ని వృధా చేశానని వాపోతారు అన్నమయ్య ఒక కీర్తనలో.

ఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు

బూడిదలో హోమమై పోయే కాలము ..

అని ఆయన ఆవేదన చెందుతారు.

ఈ సంకీర్తన చదివితే మిల్టన్, షేక్ స్పియర్గుర్తుకు వస్తారని ఇంగ్లీషు మాస్టారు రాశారు.

Wherefore are my wisdom and intelligence?

Time has flit like the embers in the Fire-sacrifice..అని అన్నమయ్యను రాజగోపాలాచారి గారు అనువదించారు.

When I consider how my light is spent, Ere half my days, in this dark world and wide..అని మిల్టన్ అంటే,

When I do count the clock that tells the time, And see the brave day sunk in hideous nigh..అని షేక్ స్పియర్

అన్నారు.. కాలం ముందు అందరూ నిస్సహాయులే కదా..

These earthly ties do not leave men even If I want,

As long as desire doe’s not leave the body.

I won’t be free from these desires even I cut them off

As long as I have the illusory inclination!

అని రాజగోపాలాచారి గారు రాసింది చదివిన తర్వాత

బాసిన బాయపు బంధములు

ఆ దేహమున్నన్నాళ్లు

కోసిన తొలగవు కోరికలు

గాసిలి చిత్తము కలిగినన్నాళ్లు.

అన్నఅన్నమయ్య ‘ఎన్నడు విజ్ఞానమిక నాకు?’ (When I do get self-knowledge) అన్న సంకీర్తన తప్పక చదవాలనిపిస్తుంది. అన్నమయ్యలో మనసెరిగి ఆయనలో విలీనమైన రాసింది కదా మరి!

‘వలదంటే బంధము, వలదంటే మోక్షము..’ అన్నారు అన్నమయ్య. Say yes, it is bondage; Say no, it is deliverance అన్నారు మాడభూషి వారు.

అదే అన్నమయ్య మరో సంకీర్తనలో ‘తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము..’అంటే Knowing the Truth is liberation, Otherwise, it is bondage.. అన్నారు మా సారు.

‘పరమ శాంతునకు పాపము రాదు, విరతి గలవానికి వెరపులేదు..’అని అన్నమయ్య అంటే, No sin attaches a peaceful man; No fear grips a detached soul..అన్నారు అనువాదకుడు.

అడుసు చొరనేల, కాళ్లు గడుగనేల,

కడలేని జన్మసాగర మీదనేల..’అని వాపోయారు అన్నమయ్య.

Why enter slush and clean the feet?

Why strive to swim the endless sea of births? అన్నారు మాడభూషి గారు.

వివక్షను వ్యతిరేకించే సంస్కృతి

రామానుజ సంప్రదాయంలో కుల వివక్షను వ్యతిరేకించే సంస్కృతి ఉన్నది. శ్రీహరిని తెలిసినవాడు,సత్యానికి కట్టుబడి ఉన్నవాడు, పర నింద చేయని వాడు, అందరి పట్లా దయను ప్రదర్శించేవాడు, మనసులోస్వచ్చత ఉన్నవాడు, అందరికీ స్నేహితుడు ఏ కులంలోఉంటేనేమిటి?అని ప్రశ్నించాడు అన్నమయ్య.

ఏకులజుడేమి ఎవ్వడైననేమి

ఆ కడ నాతడే హరినెరిగిన వాడు..

అన్న అన్నమయ్య కవితను

Whoever he may be and whatever be his caste,

it doesn’t matter if only one knew Hari!!

అని అనువదించారు.. రాజగోపాలాచారి గారు.

There is no distinction between high and low here

Srihari is the indwelling spirit of all

అని రాజగోపాలాచారి గారు అంటే,

కందువగు హీనాధికములిందులేవు

అందరికీ శ్రీహరే అంతరాత్మ..అన్నారు అన్నమయ్య.

తలమేల కులమేల తపమే కారణము

యెలమి హరిదాసులు యే జాతియైన నేమి అని అన్నమయ్యఅంటే,

Why think of caste and region,

Penance is the yardstick

What is to which caste happy servants of Hari belong?

అన్నారు రాజగోపాలాచారి గారు.

‘విజాతులన్నియు వృధా వృధా అజామిళాదుల కదియేజాతి’ అన్నసంకీర్తనలో అన్నమయ్య

‘జాతి భేదములు శరీర గుణములు

జాతి శరీరము సరి తోడనే చెడు

ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషంబనాది

ఈతల హరి విజ్ఞానపు దాస్యం ఇదియొక్క టేపో….’ అన్నారు.

Vain is the discrimination of castes,

Differences in caste are traits of the body

They perish the moment the body perishes!

Pure is the soul forever, without blemish or beginning,

Best is the caste that shuns the idea of the body

And serves to know Hari in the Self..

అని మాడభూషి చెప్పారు.

పూవులపై గాసీ, పొరి ముండ్లపైఁ గాసీని

ఆవల వెన్నెలకేమి హానివచ్చీనా ..

అని అన్నమయ్య చెబితే

Des moonlight lose anything By shining on flowers and thorns alike? అని ప్రశ్నించారు మాడభూషి వారు.

సర్వ ప్రాణుల యెడ సమబుద్ధి కలిగి యుండుటయే సర్వవేదసారము అన్నారు అన్నమయ్య

‘సమబుద్దే యిందరికి – సర్వవేద సారము.

సముడిందరికి హరి – సాధనమో యయ్యా !! అన్నసంకీర్తనలో.

Vedas, in essence, preach equal treatment of all. Hari is in all equally, an example to follow, O men!

అని చెప్పారు మాడభూషి పండితులు.

చివరగా ఇది చదవండి..

As the soul of Eternity, He shines as the Eternal

As soul of the Truth, He remains the Truth

He is manifest here and yet remains the Supreme soul

He is the one

Who rules all the worlds

He is the one

Whose form is formless

He is the God,

Whose body gives rise to

And absorbs this entire creation

Whose image is this entire universe

Whose eyes are the Sun and the Moon

He is the God

Who dwells in all the beings

Whose consciousness moves the world,

Who is invisible and beyond the dualities

He is the God

Whose pair of feet is the earth and the sky,

Who is endless from head to toe,

Whose exhalation is this gale,

Whose true servants are the virtuous

He is the Lord of all, supreme and sovereign

Looking after the welfare of the universe,

Who is the subtlest and the most profound,

He is none else than Lord of Venkatadri!

ఇది అన్నమయ్యే ఆంగ్లంలో రాసినట్లు లేదూ.. ‘నిత్యముడై ఉండు, నిత్యుడై వెలుగొందు..’ అన్న సంకీర్తన ఆంగ్లరూపం ఇది!

మాడభూషి రాజగోపాలాచారి గారు వరంగల్లులో నాకు గురువైనందుకు, ఆయన శిష్యరికంలో నాకెంతో కొంత విద్యాగంధమబ్బినందుకు, నేను మంచి జర్నలిస్టు అని ఆయన భావించినందుకు, ఆయన ఆంగ్లంలో అనువదించిన అన్నమయ్యసంకీర్తనల్ని ఈ సంక్షుభిత కాలంలో చదివి ఆ రస ప్రవాహంలో తేలేభాగ్యం అబ్బినందుకు నేను ధన్యుడినని మాత్రం చెప్పగలను.

(High in the Sky at Visnupada -Annamayya Sankirtans in Translation by Prof. M. Rajagopalachary, Authorspress Q-24, Hauz Khas Enclave, New Delhi-110 116 (India)

Price: Rs. 99/-

 (రచయిత న్యూడిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles