Monday, July 26, 2021

అభివృద్ధే ఆయుధం, అదే అంతిమ పరిష్కారం

మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయిందని, మారణహోమం తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న వేళల్లో.. మళ్ళీ ఒక్కసారిగా మృత్యుఘోష వినిపించింది. దండకారణ్యప్రాంతంలో కారుణ్యం కనుమరుగైపోయింది. ఛత్తీస్ గడ్ లోని బిజాపూర్ – సుకుమా జిల్లాల సరిహద్దుల్లో భద్రతాదళాలు బలైపోయాయి. కొందరు మావోయిస్టులు కూడా మసైపోయారు. వెరసి,మనిషిని మనిషి చంపుకున్నాడు. ఒకడు సిద్ధాంతం అంటూ రాద్ధాంతం చేస్తున్నాడు. ఇంకొకడు బతుకుతెరువులో బలైపోయాడు. యాభై ఏళ్ళ నుంచి ఈ నరమేధం ఇలాగే సాగుతూనే వుంది.దీనికి అంతం లేదా? అని సగటు మనిషి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. సమాధానం లేదు, పరిష్కారం కాదు, అన్న చందంగా ఉంది. లోపమెక్కడుందని ప్రశ్నించుకుంటే వ్యవస్థల్లోనే ఉంది. ధనిక – పేద మధ్య పెరుగుతున్న వ్యత్యాసంలో వుంది. మనిషిని మనిషి కాల్చుకుతినే దోపిడిలో ఉంది.విలాసాలకు – ఆకలికి మధ్య చెలరేగుతున్న కేకల్లో ఉంది.ఈ అసమానతలే అనర్ధాలకు దారి తీస్తున్నాయి. ఈ అశాంతికి,  ఈ అమానుషానికి మూలం ఎక్కండుందో తెలియాల్సిన వారందరికీ తెలుసు.

అరణ్యాల్లో రావణకాష్టం

పరిష్కారం చూపించకపోవడం వల్లే మానవ నష్టం జరుగుతోంది, అరణ్యాల్లో రావణకాష్టం కాలుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలో చాలా వరకూ మావోయిస్టుల అలజడి ఆగిపోయింది. ఒరిస్సా సరిహద్దుల్లో కొంత ఉంది.ఛత్తీస్ గడ్ లో మాత్రం కేంద్రీకృతమై వుంది. ప్రస్తుతం, అక్కడ మూడు ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయి. (1) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం (2) కేంద్ర ప్రభుత్వం (3) అన్నల కనుసన్నల్లో ఉన్న జనతన సర్కార్. ఈ మూడు ప్రభుత్వాల సమాంతర పాలనలో  ఆదివాసులతో పాటు సామాన్యులు కూడా మగ్గిపోతున్నారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య చర్చల ద్వారా సమస్యకు ముగింపు పలకాలని చూసినా, అది కుదరలేదు,కుదిరేట్టు లేదు. 

నక్సల్స్ తో వైఎస్ సర్కార్ చర్చలు

దేశంలోనే మొట్టమొదటిసారిగా మావోయిస్టులు (అప్పుడు నక్సలైట్లు) – ప్రభుత్వం మధ్య చర్చలకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకారం జరిగింది.2004లో, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించిన కొత్తల్లో ఆ చర్చలు జరిగాయి. నక్సలైట్ల నేత అక్కిరాజు రామకృష్ణ అగ్ర నాయకత్వంలో ముఖ్య నాయకులందరూ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చారు. శంకరన్, కన్నాభిరాన్, పొత్తూరి వెంకటేశ్వరావు, హరగోపాల్ మొదలైన మేధావులు ఇరుపక్షాల మధ్య చర్చలు జరగడానికి కీలక భూమిక పోషించారు. నక్సలైట్లు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య రెండు రోజులపాటు చర్చలు సాగాయి. కానీ, అర్ధాంతరంగానే ముగిసిపోయాయి. నక్సల్స్ అందరూ ఆయుధాలు వీడి, హింసకు ముగింపు పలికి, జనజీవన స్రవంతిలో కలవాలన్నది ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమైన ప్రతిపాదన.

నక్సల్స్ షరతులకు ‘నో’

 దానికి ప్రతిగా, నక్సల్స్ కొన్ని షరతులు పెట్టారు. అవి సాధ్యపడేది కావని ప్రభుత్వం  చర్చలకు అర్ధాంతరంగా ముగింపు పలికింది. ఆ మధ్య ఛత్తీస్ గడ్  లో కూడా మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు.దండకారణ్యం నుంచి భద్రతా దళాలను విరమింపచేయాలని,గాలింపు చర్యలను ఆపివేయాలని మావోయిస్టులు కొన్ని షరతులు విధించారు. దానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఒప్పుకోలేదు. దానితో చర్చల అంశం ముందుకు సాగలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరిగినా, అవి ఫలవంతం కాలేదు. ఇప్పుడు ఛత్తీస్ గడ్ లో ఆ ప్రతిపాదన అంగుళం కూడా ముందుకు వెళ్ళేట్టు లేదు. ఈ రెండు వర్గాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కుదురుతుందనే నమ్మకం ఇప్పటికీ చాలామందిలో లేదు.

సమస్యకు మూలం అందరికీ తెలుసు

ఈ సమస్యకు మూలమైన ఆదివాసీల అభివృద్ధి జరిగినప్పుడు, గిరిజన ప్రాంతాలు ప్రగతి బాటలో నడచినప్పుడు, వారి కష్టాలు తీరినప్పుడు, నాగరికత వైపు వారి ప్రయాణం ఊపందుకున్నప్పుడు, ప్రభుత్వ వ్యవస్థలపై వారికి విశ్వాసం కలిగినప్పుడు, దోపిడీ, దురాక్రమాలు ఆగినప్పుడు ఈ అశాంతి ఆగుతుంది. ఈ ఘోరకలి ముగుస్తుంది. నక్సలైట్ ఉద్యమ పరిణామాన్ని గమనిస్తే, ఇప్పుడు అది కొత్త దారిపట్టింది. నాయకత్వంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ మిగిలిన సామాజిక వర్గాలు, ప్రాంతాలకు చెందినవారు ప్రధాన నాయకులుగా ఉండి ఉద్యమాన్ని నడిపించారు. ఆదివాసులు దళంలో ఉండడం ద్వారా, వివిధ మార్గాల్లో సహకారం అందించడం ద్వారా ఉద్యమం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు దాని రూపురేఖలు మారిపోతున్నాయి.

నేటి మావోయిస్టు వ్యూహకర్త ఒక ఆదివాసీ

ఇప్పుడు ఆదివాసీలకు చెందిన హిడ్మా ప్రధాన నాయకుడుగా నిలిచి యుద్ధ వ్యూహం నిర్మించాడు. గెరిల్లా రణతంత్రంలో అతను రాటుదేలి వున్నాడు.ప్రస్తుతం ఇటువంటి నాయకులే ఉద్యమాన్ని నడిపిస్తున్నట్లుగా మేధావులు అభిప్రాయ పడుతున్నారు.గిరిజన ప్రాంతాలపై సమగ్రమైన అవగాహన ఉండి, యుద్ధరీతులు తెలిసిన ఆదివాసీలే ప్రధాన నాయకులుగా ఉద్యమం కొత్త రూపు తీసుకోవడం ఏ మాత్రం ఆశావహ పరిణామం కాదు. ఒకప్పుడు ఆదివాసీల తరపున వేరేవాళ్లు పోరాడేవారు. ఇప్పుడు ఆదివాసులే ముఖ్యనాయకులుగా మారి, వారి కోసం వారే పోరాటానికి దిగుతున్నారు.

చత్తీస్ గఢ్ లో మూడు ప్రభుత్వాలు

ఇదీ, ప్రధానమైన మార్పు. ప్రభుత్వాలకు అన్ని రకాల శక్తియుక్తులు ఉండుగాక, కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. స్వచ్ఛమైన పాలనతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవాలి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు గిరిజనులను సొంతం చేసుకోవాలి. మావోయిజం /నక్సలిజం రాజ్యమేలుతోంది అడవుల్లోనే. మావోయిస్టులు తలదాచుకోడానికి, కార్యకలాపాలు సాగించడానికి అనువైన ప్రాంతాలు గిరిసీమలే.అక్కడ శాంతి, అభివృద్ధి నెలకొల్పి,వారి హక్కులకు సర్వ రక్షణ కల్పించి,ఆదివాసుల మనసుదోచుకుంటే? ఈ సమస్య త్వరలోనే తీరిపోతుందని విశ్లేషకుల అభిప్రాయం. బలిమెల నుంచి నేటి బస్తర్ వరకూ జరిగిన సంఘటనలను కేవలం పోస్ట్ మార్టం చేసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అభివృద్ధి ఆయుధంగా సాగినప్పుడు,అరాచకం అంతరించినప్పుడు అమానుష చర్యలన్నీ అంతమవుతాయి. అరాచకవాదులు అణిగిపోతారు.ప్రతీకార చర్యలే సమాధానం కాదు. ప్రగతి మార్గమే సరియైన విధానం.మావోయిజం తగ్గుముఖం పట్టిన ప్రాంతాలను అధ్యయనం చేసి, ఆచరిస్తే, ఆన్నీ సర్దుకుంటాయి.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles