Saturday, April 20, 2024

అంతా ఆరంభశూరత్వమేనా?

కరోనాను తొలిదశలో కట్టడి చేసినందుకు భారత్ కు ప్రశంసలు వెల్లువెత్తాయి. మిగిలిన దేశాలకు మందులు,వ్యాక్సిన్లు పంపినందుకు కృతజ్ఞతలు, అభినందనలు వరుసకట్టాయి. నేడు రెండో దశలో పరిస్థితి అదుపు తప్పుతున్న వేళ, విమర్శలు చుట్టుముడుతున్నాయి. “ఆరంభశూరులు ఆంధ్రులు”అనే నానుడి ప్రసిద్ధి. ఆ పదబంధాలు నేడు భారతదేశం మొత్తానికి సరిపోతాయన్నట్లుగా వాతావరణం ఉంది.

నిరుటి లాక్ డౌన్ మేలు చేసింది

తొలి దశలో లాక్ డౌన్ అమలు వల్ల మేలు జరిగిందన్నది వాస్తవం. వైరస్ వ్యాప్తిని అది కట్టడి చేసింది. మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇదే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) కూడా భారత్ కు కితాబు ఇచ్చింది. ఆ ఆరంభ శూరత్వం యావత్తు భారతమంతా కొన్నాళ్లే పనిచేసింది. లాక్ డౌన్ సడలింపులు కొంప ముంచాయి. అందులో ప్రభుత్వాలను పెద్దగా తప్పు పట్టనక్కర్లేదు. ప్రజలే విశృంఖలంగా ప్రవర్తించారు. దాని పర్యవసానమే నేటి మరణమృదంగం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా ఇప్పుడప్పుడే సమసిపోదు, దానితో కొన్నాళ్ళు కాపరం చెయ్యాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్పారు.ఆ స్పృహ ఆచరణలో ఏమైంది? 139కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి.

ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు?

ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నలను ప్రపంచం మొత్తం భారత ప్రభుత్వాన్ని సంధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో కథనాలు భారత్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ దుస్థితికి ప్రభుత్వాన్నే ఎక్కువగా తప్పు పడుతున్నారు. ప్రజల అలసత్వాన్ని దుయ్యబడుతున్నారు. అదే సమయంలో, ప్రపంచ మీడియా భారత ప్రజల పట్ల సానుభూతిని కూడా వ్యక్తం చేస్తోంది. ఇంత ఉధృతిలేని తొలి దశలోనే ఆరోగ్య సదుపాయాలు లేక, సేవలు అందించడానికి సరిపడా సిబ్బంది చాలక, మందులు అందుబాటులో లేక దేశం నానా తిప్పలు పడింది. ఈ విషయాలను ఎలా మరచిపోయారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని జబ్బలు చరుచుకున్న వేళ, దేశ జనాభాకు సరిపడా వ్యాక్సిన్లను ఎందుకు సన్నద్ధం చేయలేదు, భారతదేశంలో తయారైన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు తరలిస్తుంటే ప్రభువులు నిద్రపోతున్నారా, రాజకీయాలు, అధికారం, ప్రచారం మీద ఉన్న కక్కుర్తి, యావ ప్రజా జీవనంపైన లేదా? అని ఒళ్ళుమండిన  సగటు మనిషి పాలకులను ప్రశ్నిస్తున్నాడు.

సమాధానం చెప్పలేని స్థితిలో పాలకులు

సాటి మనిషికి సమాధానం చెప్పలేని స్థితిలోనే పాలకులు ఉంటే, ఏదో ఒకరోజు ప్రజావ్యతిరేకతను పెద్దఎత్తున ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనాను కట్టడి చెయ్యడంలో ప్రభుత్వాలు విఫలమైతే, రాబోయే ఎన్నికల్లో ప్రతి నాయకుడు దానికి మూల్యం చెల్లిస్తాడు. వైరస్ వ్యాప్తికి ప్రజల క్రమశిక్షణారాహిత్యం ప్రధమ కారణం. సదుపాయాలు, ముందుజాగ్రత్త చర్యలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్లు సమృద్ధిగా కల్పించడంలో ప్రణాళికలు లేకపోవడం ప్రభుత్వాల వైఫల్యం. అమెరికాలో  ట్రంప్ సమయంలో కరోనా విషయంలో ప్రభుత్వం అశ్రద్ధగా ఉందని వార్తలు వచ్చినా, వ్యాక్సిన్ల రూపకల్పనపై వారు దృష్టిపై విశిష్టంగా సారించారు. జో బైడెన్ అధికారంలోకి వచ్చి అతికొద్ది కాలమేఅయ్యింది. ఈ కాస్త సమయంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసాధారణ విజయాన్ని సాధించారు.

అమెరికాలో అవసరానికి రెట్టింపు టీకాలు

ఆ దేశ జనాభాకు రెట్టింపు వ్యాక్సిన్లు నేడు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ల సామర్ధ్యత కూడా సంతృప్తికరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. త్వరలోనే సామూహిక నిరోధక శక్తిని (హెర్డ్ ఇమ్మ్యూనిటీ) సాధించే దిశలో అమెరికా ఉంది. ట్రంప్ నిర్లక్ష్యం వల్ల కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నా, సమర్ధవంతమైన వ్యాక్సినేషన్ విధానం ద్వారా అమెరికా మంచి ఫలితాలను రాబడుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ కు ఆపన్నహస్తం అందించడానికి ముందుకు వస్తున్నాయి. వారి సహకారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆక్సిజన్ లేమి అనేది లేకుండా చూసుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎన్నో రెట్లు వేగవంతమవ్వాలి. ఇతర దేశాల్లో తయారైన సమర్ధవంతమైన వ్యాక్సిన్లను ఆఘమేఘాల మీద మన దేశానికి రప్పించుకోవాలి. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, చికిత్స సంగతులు దేవుడెరుగు, కరోనా పరీక్షలకు కూడా వేలాదిమంది బారులుతీరుతున్నారు.

వేగం, పారదర్శకత పెరగాలి

కరోనాను అరికట్టే ప్రతిఅంశంలో, ప్రతిదశలో వేగం, పారదర్శకత పెరగాలి. కట్టడి అంశంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య సమన్వయం ఇంకా కుదరడం లేదు. అక్కడా రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దిల్లీలో పరిణామాలు, సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్, రాత్రివేళల కర్ఫ్యూ పలు రాష్ట్రాల్లో అమలులోకి వచ్చింది. కరోనా వైరస్ విషయంలో, గతంతో పోల్చుకుంటే వైద్యులకు అవగాహన బాగా పెరిగింది. చికిత్సలో అది బాగా ఉపయోగపడుతుంది.కానీ, ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రజల రక్తం తాగుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు నిఘా (విజిలెన్స్ ) పెట్టి, దోపిడీని ఆపకపోతే, ప్రాణనష్టం పెరగడమేకాక, సామాజిక అశాంతి ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫైజర్ సంస్థ ప్రతిపాదన స్వాగతించదగినదే

ప్రభుత్వ మార్గాల ద్వారా భారత్ లో వ్యాక్సిన్ సరఫరా చేయడానికి తాము సిద్ధమని ఫైజర్ సంస్థ కూడా ఇటీవలే ప్రకటించింది. ఇది మంచి పరిణామమే.ఈ టీకా 95శాతం సమర్ధత కలిగిఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వాలు వెంటనే సద్వినియోగం చేసుకోవాలి.ఇటువంటి సమర్ధవంతమైన వ్యాక్సిన్ల అవసరం ఎంతో ఉందని నిపుణులు ఇప్పటికే గుర్తించారు. మాస్క్ ధరించడం, శానిటైజేషన్, భౌతికదూరం పాటించడం ఎంత ముఖ్యమో, అన్నింటికంటే ముఖ్యమైంది మనోధైర్యం కలిగి ఉండడం, పెంచుకోవడం. ఇంకా ముఖ్యమైంది అధైర్యం, భయాన్ని దరిచేరకుండా చూసుకోవడమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో వీటి పాత్ర చాలా కీలకమని సూచిస్తున్నారు.

ఆహారపుటలవాట్లపైనా దృష్టి

భారతీయమైన ఆహార, ఆచార వ్యవహారాలు, ఆలోచనా విధానం కూడా కరోనా వైరస్ నుంచి రక్షించుకోడానికి ఎన్నో రెట్లు ఉపయోగపడతాయని వైద్య పండితులు గుర్తుచేస్తున్నారు. సంభవిస్తున్న మరణాలన్నీ కేవలం కరోనా వైరస్ వల్ల జరుగుతున్నాయా, ఇంకా వేరే కారణాలు, ప్రభావాల వల్ల ఏర్పడుతున్నాయా అన్నది కూడా చర్చనీయాంశం. మే 1నుంచి 18ఏళ్ళ పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తోంది.45ఏళ్ళు దాటినవారికి ఈపాటికే అమలులోకి వచ్చింది. కాకపోతే,ఇవన్నీ ప్రకటనలకు, ప్రచారానికి పరిమితమవుతున్నాయి. క్రియారూపంలో ఆశించిన విధంగా జరుగడం లేదు.

లక్ష్యాలు పెట్టుకొని విజయాలు సాధించాలి

ఇప్పటికైనా, పాలకులు మేలుకొని, వ్యాక్సినేషన్ ను సమర్ధవంతంగా నడపాలి. అమెరికాలాగా, లక్ష్యాలు పెట్టుకొని విజయాన్ని సాధించాలి. మన జనాభా పెద్ద సంఖ్యలో ఉండడం తొలి సవాల్. దానికి తగ్గట్టుగా సిద్ధమవ్వడం కొంత కష్టమైనా, అధిగమించాలి.వ్యాక్సిన్లు , ఆక్సిజన్ కొరత అనేది లేకుండా చెయ్యాలి. అదే సమయంలో, వలస కార్మికులపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.ప్రజలు కూడా ఇప్పటికైనా స్వయం క్రమశిక్షణ పెంచుకొని ముందుకు సాగాలి. ఇవ్వన్నీ జరిగితే, కొన్ని నెలల్లోనే భారతదేశంలో చల్లని వాతావరణం ఏర్పడుతుంది.ప్రభుత్వాలు, ప్రజలు కలిసి సాగాల్సిన సమయం మరోసారి ఆసన్నమైంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles